15, మార్చి 2015, ఆదివారం

మీ బ్లాగ్ బాక్-అప్ తీసుకున్నారా!



మనం ఊసుపోకో, మనకు తెలిసినది నలుగురికీ చెప్పటానికో మనకంటూ ఒక బ్లాగు ఏర్పాటు చేసుకుని మనకు తోచిన నాలుగు మాటలూ అక్కడ వ్రాయటానికి కొంత సమయం కేటాయిస్తూ ఉంటాము.

అలా వ్రాసుకుంటున్నది ఎక్కడా!  మన కంప్యూటర్లో కాదు. ఏ గూగుల్ వారో, వర్డ్ ప్రెస్ వారో ఏర్పరిచిన ఉచిత ఫ్లాట్-ఫారం  మీద మన వ్రాతలన్నీ వ్రాసుకుంటూ ఉంటాము. మనం వ్రాసుకున్న బ్లాగులో రోజులు గడిచిన కొద్దీ విషయ విశేషాలు పెరిగిపోతాయి. ఏదన్నా జరిగి మన వ్రాసుకున్నవన్నీ కూడా పొతే! చాలా బాధ కదా. బ్లాగర్ లో HTML కోడింగ్ కాపీ చేసుకోవటానికి అవకాశం ఉన్నది కాని ఆ కోడ్ ను మళ్ళీ బ్లాగులోకి కాపీచేస్తే మళ్ళీ చూడలేము.

మనకు బ్లాగులోకంలో చందమామ రాజుగా సుపరిచితులు ఐన రాజశేఖర రాజు గారు నిర్వహిస్తున్న బ్లాగు "చందమామ చరిత్ర" ఇక కనపడదు, తీసేస్తున్నాము అని జల్లెడ నిర్వాహకులు వారికి ఫోను చేసు చెప్పారుట. పాపం రాజుగారు, తాను వ్రాసుకున్నవి అన్నీ నోట్ పాడ్ లోకి కాపీ చేసుకుంటూ ఒకరోజున రాత్రి నాకు ఫోనుచేసి విషయం చెప్పారు. గూగులమ్మను అడిగితె సైట్ కాపీ చెయ్యటానికి అనేక సాఫ్ట్వేర్లు  ఉన్న విషయం తెలిసింది. వెంటనే ఒక  సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకుని, రాజుగారి బ్లాగు మొత్తం యధాతధంగా బాక్-అప్ చేసి ఆయనకు గూగుల్ డ్రైవ్ ద్వారా పంపాను.

బ్లాగర్ డాట్.కాం వారు మన బ్లాగులను తీసేయ్యకపోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది బాక్-అప్ చేసుకోవటం మంచిది అనిపించి నా బ్లాగును కూడా బాక్-అప్ తీసి పదిలపరిచాను(దాదాపు 9 జి బి వచ్చింది-ఆరు సంవత్సరాల కృషి మరి)

ఇంతకీ ఆ సాఫ్ట్వేర్ ఏమిటి ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయాలు ఈ కింద ఇస్తున్నాను.

సాఫ్ట్వేర్ పేరు : Win Httrack Site Copier

పై సాఫ్ట్వేర్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి?

ఈ కింది లింకు నొక్కి ఆ సాఫ్ట్వేర్ అందిస్తున్న వారి వెబ్ సైటుకు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు:


ఈ సాఫ్ట్వేర్ గురించిన పూర్తీ వివరాలు ఈ కింది లింకు నొక్కి తెలుసుకోవచ్చు:


ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం, ఎన్ని రోజులైనా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవచ్చు. మన బ్లాగే కాదు, మనకు  నచ్చిన మంచి వెబ్ సైటు కాని బ్లాగు కాని ఉంటే  ఈ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి అది మొత్తం కూడా మన పి సి లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సరే ఈరోజువరకూ బాక్ అప్ చేసేసాము, మళ్ళీ కొన్ని రోజుల తరువాత చూస్తె ఒక పదో ఇరవయ్యో కొత్త వ్యాసాలూ వ్రాసి ఉంటాము. మరి అప్పుడు! ఈ సాఫ్ట్వేర్లో, అప్పటికే బాక్ అప్ తీసుకున్న వెబ్ సైట్/బ్లాగుకు కొంతకాల తరువాత మళ్ళీ వెళ్ళి అప్డేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉన్నది.

మరొక విషయం ఏమంటే, మనం మన బ్లాగులో ఎవన్నా పాటలు, వీడియోలు లింకులు ఇచ్చి ఉంటే ఆయా లింకుల నుంచి ఆడియో, వీడియోలను మన పిసిలోకి డౌన్లోడ్ చేసి,  ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఆ బ్లాగు/వెబ్సైటు చూసి ఆనందించవచ్చు.

బాక్-అప్ పూర్తయిన తరువాత, మనంముందుగానే సూచించిన చోటుకు (సి డ్రైవ్, డి డ్రైవ్ లేదా మనకు వీలయిన మరొక డ్రైవ్) మన బ్లాగు బాక్-అప్ పదిల పరుస్తుంది ఈ సాఫ్ట్వేర్. మనం ముందుగానే సూచించిన డ్రైవ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ మనం ఇచ్చిన పేరుతొ ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో అనేక వందల ఫైళ్ళు, ఫోల్డర్లు ఉంటాయి. అవ్వేమీ మనం ఓపెన్ చెయ్యకర్లేదు. మన బ్లాగు పేరుతొ ఉన్న ఫోల్డర్ తెరిచి అందులో ఇండెక్స్ (Index.html) అనే పేరుతొ ఉన్న ఫైలును రెండుసార్లు క్లిక్ చేస్తే చాలు మన బ్లాగు మన కంప్యూటర్  లోనే చక్కగా ఆరోజువరకూ పోస్ట్ చేసిన వ్యాసాలతో కళకళ లాడుతూ కనిపించి మనల్ని అలరిస్తుంది.

కాబట్టి ఎంతో ఇష్టంగా, సమయం వెచ్చించి పెంచి పెద్ద చేసుకున్న మన బ్లాగులను ఎప్పటికప్పుడు బాక్-అప్ తీసుకుని ఉంచుకుంటే, రేప్పొద్దున గూగుల్ వాడో, వర్డ్ ప్రేస్ వాడో ఇక మేము బ్లాగు ఉచితంగా ఇవ్వము నెలకు ఇంత డబ్బులు కట్టాలి అంటే, మనం అంత కట్టలేనప్పుడు మన బ్లాగు మనదగ్గరే ఉంటుంది. లేదా ఏదన్నా కారణాల వల్ల బ్లాగు పొతే, బాక్-అప్ తీసుకుని ఉంచుకుంటే ఏ బాధా ఉండదు కదా .



3 కామెంట్‌లు:

  1. శివ గారూ! ‘చందమామ చరిత్ర’ బ్లాగును పదిలపరిచి... చాలా మంచి పని చేశారు. ఎంతొోమందికి ఉపయోగపడే సమాచారాన్ని వివరంగా అందించారు. థాంక్యూ. సాంకేతిక పరిజ్ఞానంపై మీ అభిరుచినీ, పట్టునూ మరోసారి నిరూపించుకున్నారు.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు వేణూ గారూ. చందమామ చరిత్రే కాదు, చంపి ఉద్యమానికి ముందుండి అందరికీ ఉత్సాహాన్నిచ్చిన "బ్లాగాగ్ని" ఫణి గారు గుర్తుండే ఉంటారు. ఆ బ్లాగు కూడా (ఆయన ఈ మధ్య కాలంలో అప్డేట్ చెయ్యలేదు) చందమామ చరిత్రలో భాగంగా బాక్-అప్ చేసి ఆయనకు మెయిలు ద్వారా పంపాను.

    రిప్లయితొలగించండి
  3. చాలా ఆనందం. మంచి సంగతి చెప్పారు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.