15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఎన్నాళ్ళు ఇలా!!!???

ఏళ్ళకి ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఉద్యమాలు వస్తున్నాయి, పార్టీలు పుడుతున్నాయి, వైతరణీ లో కలిసీపోతున్నాయి, ఆపైన ఆ ఉద్యమాలు  అణిగీపోతున్నాయి. మళ్ళి కొన్నాళ్ళకి అదే ఉద్యమం మళ్ళి పైకెగసి మరొక పార్టీ పుడుతున్నది. రాజీనామాలు, సంప్రదింపులు, పార్టీల్లో ఉపప్రాంతీయ "గుంపులు" వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలు, పైనుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఇంటర్వ్యూలు, బూకరింపు మాటలు. కమిషన్లు, సంప్రదింపులు, ఆల్ పార్టీ సమావేశాలు. ఇలా ఇలా ఒక విషయాన్ని ఎంతగా సాగదియ్యాలో అంతా చేసి చివరకు రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడి ఏ పని చేసినా సరే అదెందుకు, అక్కడే ఎందుకు, ఇక్కడ ఎందుకు కాదు అని ప్రతిదీ భూతద్దం కింద పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు నటిస్తూ, పార్టీ పెద్దలు ఇచ్చిన ఆదేశాలు పాటించటం. మొత్తం మీద జనజీవనాన్ని అతలాకుతలం చేస్తూ, ఏ పనీ జరగనీయని పరిస్థితి మన రాష్ట్రానికి  పట్టింది. వీటన్నిటికీ మించి కాస్త ఉన్నది గంపంత చేసి, ఊరూ వాడా ఏకం చేస్తూ ఉన్నవీ (ఎక్కువగా లేనివీ) "ప్రచారం" చేస్తున్న స్వంత  లాభం మాత్రమే తెలిసినవి అయ్యి "మీడియా" అని పిలవబడుతున్న కొన్ని  కార్పొరేట్ చానెళ్ళు , పార్టీ బాకా కరపత్రాలూ, వాటిల్ని మానేజ్ చేస్తున్న రాజకీయ పార్టీలు. అబ్బే మమ్మల్ని ఎవరు మానేజ్ చేస్తున్నారు, అని ఒక పక్క భుజాలు తడుముకుంటూనే బూకరించే వాళ్ళూ  లేకపోలేదు.

1974 ప్రాంతాల్లో వాటర్ గేట్ స్కాండల్ (కుంభకోణం అంటానికి వీల్లేదు, అందులో ఎవరూ డబ్బులు తినెయ్యలేదు) బయటపడింది. అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ పీకల్లోతు కూరుకుపొయ్యాడు. కాని నా ఉద్దేశ్యం నిక్సన్ తో ఇప్పటి మన రాజేకీయ నాయకులను  పోల్చాలని  కాదు. నిక్సన్ చేసినది మనవాళ్ళు చేస్తున్న దానిలో ఏపాటి! పోలికకన్నా హద్దూ పద్దూ ఉండద్దూ!!  నాకు జ్ఞాపకానికి వచ్చినది ఏమంటే అప్పట్లో ప్రముఖ అమెరికన్ పత్రిక "టైమ్" ముఖచిత్రంగా ఒక కార్టూన్ వచ్చింది. వాటర్ గేట్ స్కాండల్ లో పేర్లు బయటపడ్డ వాళ్ళ మధ్య నిక్సన్ చేతులు కట్టుకుని నుంచుని ఉంటాడు. ఆయన చుట్టూ నిలబడ్డ ఆయన అనుచరులు అనుంగు మితృలు  చెంచాలు వలయాకారంగా మరొకరిని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఆ స్కాండల్ లో తను తప్ప మరొకరు అని వేలెత్తి చూపటం మాత్రమే అందరూ చేస్తున్నారు.

ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా పైనున్న బొమ్మలోని పరిస్థితే మరి. ఎవరికీ వాళ్ళు మరొకళ్ళు అభిప్రాయం చెప్పాలిట, తమ అభిప్రాయం మాత్రం చెప్పరు. ఒకడు రెండు   కళ్ళంటాడు, మరొకడు తెచ్చేది ఇచ్చేది మేమే అంటాడు, మరొకడు మధ్యలో దూరి, వస్తే నేనాపలేను రాకపోతే తెచ్చివ్వలేను అని అర్ధంపర్ధం లేని మాటలు  వదరుతూ దేశం అంతా తిరుగుతుంటాడు. అసలు అధికారం లో ఉన్న పార్టీ ఎవరికీ అంతు చిక్కని రీతిలో రకరకాల విన్యాసాలు చేస్తూ, అసలు విషయం తేలకుండా నానుస్తూ కాలం గడుపుతున్నది. వీళ్ళల్లో ప్రతివాడికీ ఒక బాకా చానల్, ఒక కరపత్రాన్ని పోలిన పేపరు వెన్ను దన్ను. కొండొకచో ఒకటికి మించి కూడానుట. మరికొన్ని పైకి కనపడకుండా లోపాయికారిగా   నిస్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా, తమ తమ స్వార్ధ వ్యాపార ప్రయోజనాల కోసం, తలో కొమ్ము కాస్తూ తగినంతగా ఆజ్యం పోస్తూ, తమ టి ఆర్ పి పబ్బం విజయవంతంగా గడిపేసుకుంటున్నది.

ఒహాయన వచ్చి చూసుకోండి నెలరోజుల్లో తేల్చి పారేస్తాను అంటాడు, నైసుగా నవ్వుతూ కేమేరాలకి ఫోజిస్తూ. ఆయన చెప్పిన తేదీ దగ్గర పడి అందరూ ఊపిరి బిగబట్టిన సమయంలో మరో తైనాతి  వచ్చి నెల అంటే ముఫ్ఫై రోజులని ఎవడన్నాడు అంటాడు  (వాళ్ళ మాష్టార్లు బతికి ఉండే అవకాశం  లేదన్న భరోసాతో. బతికి ఉంటే, పార్లమెంట్ లోనే గుంజీలు తీయించి ఉండేవారు, అంత అపభ్రంశంగా నెలకేన్ని రోజులో తెలియకుండా వాగినందుకు) .

అప్పుడెప్పుడో 1972 చివర్లో 1973 మొదట్లో ఆంధ్ర ప్రాంతంలో ఒక ఉధృతమైన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చి కేద్రం బలంగా ఉండటం వల్ల  అణచివేయబడింది. అదే ప్రాతంలో ఇప్పుడు సమైక్య ఉద్యమం జరుగుతొందన్న భ్రమ కొంతమంది కలిగించే విఫల ప్రయత్నం చేస్తున్నారు. కాని అటువంటి ఉద్యమం ఏమీ రాజుకునే అవకాశాలు కనపడటం లేదు. అప్పట్లో జై ఆంధ్రా అంటూ చిన్న పెద్దా అందరూ నినదిస్తున్న రోజుల్లో, ప్రముఖ రాజకీయ వ్యంగ్య చిత్ర కారుడు శ్రీ ఊమెన్, కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ఒక అర్ధవంతమైన కార్టూన్ వేశారు. ఆ కార్టూన్ చూడండి, ఇప్పటికీ కేద్రాని అదే స్ట్రాటజీ ఏమీ మార్పు లేదు, మనుషులు సంవత్సరాలు మారాయి అంతే.

http://4.bp.blogspot.com/-oYy0BPz2PIY/TjILS2IgOjI/AAAAAAAAC4g/JHPg93B--ck/s1600/06021973%2BOOMEN%2BCARTOON.JPG


ఎన్నాళ్ళిలా?!
ఒక నిర్ణయం తీసుకునే శక్తి ఉన్న నాయకులే లేరా మనకు. నాయకులకు దిశానిర్దేశనం చెయ్యగలిగిన శక్తి మంతులు మీడియాలోనూ  లేరు ఎటువంటి దుస్థితి పట్టింది దేశానికి!















1 కామెంట్‌:

  1. "...ఆంద్ర ప్రాంతంలో సమైక్య వాద ఉద్యమం జరుగుతోందన్న భ్రమను కొంతమంది కలిగించేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు... కానీ అటువంటి ఉద్యమం రాజుకునే అవకాశాలు ఏమీ కనబడటం లేదు ...."

    వాస్తవం చెప్పారు.
    అలాంటి భ్రమలతో పాటు కొందరు రాజకీయ వ్యాపారవేత్తలు -
    కేవలం తమ స్వార్ధ ప్రయోజనాలకోసం -
    తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఐదు ముక్కలవుతుంది...
    దేశంలో 500 కొత్త రాష్ట్రాల డిమాండ్లు పుట్టుకొస్తాయి...
    దేశం ముక్క చెక్కలవుతుంది,...
    నక్సలిజం పెచ్చరిల్లి పోతుంది ....
    హైదరాబాదులో మతోన్మాదం చెలరేగుతుంది ...
    కోస్తాంధ్ర చుక్క నీళ్ళు లేక ఎడారిగా మారుతుంది,
    రాయలసీమ వెనకబడిపోతుంది ...
    అంటూ ప్రజలను, ధిల్లీ పాలకులను రకరకాలుగా భయపెడుతూ
    రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారు.
    ఇరుప్రాంతాల ప్రజలు ముందు ఈ దగుల్భాజీ రాజకీయ నాయకులకు బుద్ది చెప్తే తప్ప....
    సత్వరమే ఆంద్ర తెలంగాణా రాష్ట్రాలు సామరస్యంగా విడిపోతే తప్ప ...
    తెలుగు వారికి భవిష్యత్తు లేదు

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.