25, సెప్టెంబర్ 2012, మంగళవారం

తెలుగులో కొత్త పదాలు


ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ బాబు గారు వేసిన కార్టూన్ ఆయన బ్లాగ్ "బాబు కార్టూన్స్" (క్లిక్) నుంచి తీసుకొనబడినది 
తెలుగు భాషను పరిపుష్టం చెయ్యటానికి,  ప్రస్తుతం మనం వాడుతున్న ఆంగ్ల పదాలకు సమానార్ధాన్ని ఇచ్చే తెలుగు పదాలను సూచించే ప్రక్రియ ఈ మధ్య బాగానే జరుగుతున్నది. కాని ఈ ప్రక్రియ ఆంగ్ల పదాన్ని యధాతధంగా తెలుగులోకి అనువాదం చెయ్యటానికి ఎక్కువగా పరిమితం అయ్యిందని నా అభిప్రాయం. లేదా ఎక్కడా అంతుచిక్కని గ్రాంధికపు  మాటల సృష్టి చేసే ప్రయత్నమూ జరుగుతున్నది. సరే నేటి  సరళమైన తెలుగు,  రేపటి గ్రాంధికం అవ్వచ్చు అన్న భయం కొంతమంది వెలిబుచ్చినా,  ఈ రెండూ కాకుండా  తెలుగులో  ఆంగ్ల పదాలకు తెలుగులోకి మనకు తెలిసిన సరళమైన తెలుగులోకే తీసుకు రావాలి. రాబొయ్యే తరాలకు ఇది గ్రాంధికం అనిపిస్తే వాళ్ళు మళ్ళీ  వాళ్లకు సులభమైన సరళ తెలుగులోకి మార్చుకుంటారు. ఇవ్వాళే  ఒక కొరుకుడు పడని  మాట తీసుకొస్తే, రాబొయ్యే తరాలవరకూ ఆ మాట చేరకుండాపోతుంది.

ఈ విషయం మీద కొన్ని ఆలోచనలను రేకేత్తించింది ఒక బ్లాగు. ఆ బ్లాగులో రోజుకొక ఆంగ్ల పదం ఇస్తున్నారు, తెలుగు పదం సూచించమని కోరుతున్నారు. అక్కడ ఆంగ్ల పదానికి, తెలుగు పద సూచన ఉన్నదే కాని,  ఆ పదం గురించిన చర్చ అంతగా లేదు. తెలుగులోకి ఒక పదం సూచించి, ఆ పదం ఎంతవరకూ సరైనది అని చూడటానికి చర్చ జరగాలి. తెలుగు పద బృందాలు(వాళ్ళు గుంపులుగా తమని తాము పరిగణించుకుంటున్నారు!) ఉన్నాయి కాని,  అక్కడ జరిగేది ఒక విధమైన ఉద్రేకంతో మాటల వంటకం    అనిపిస్తుంది. అక్కడా పెద్దగా అర్ధవంతమైన చర్చలు జరగటం లేదు. ఒకళ్ళు అన్నది మరొకళ్ళు కాదు అనటమే  చర్చ అనుకుంటే తప్ప. "గుంపు"  అంటే ఏదో చిత్రం జరుగుతోంది ఇక్కడ అని చూడటానికి పోగు పడేవాళ్ళను  అనే మాట. వాళ్ళందరికీ ఒకే దృక్పథం  ఉండాలని లేదు. కాని, "బృందం"  అంటే ఒక పని చెయ్యటానికి ఒకే ధ్యేయంమీద తమ దృష్టి  కేంద్రీకరించి  పనిచేసే వాళ్ళని నా దృష్టి. In English also, there is vast difference between the words "Crowd" and "Group".


సరే నాకు ఈ కాసిని మాటలు వ్రాయటానికి పురిగోల్పిన బ్లాగ్ "మన తెలుగు పదాలు" క్లిక్. ఆ బ్లాగ్ రచయిత (పేరు తెలియదు) పైన చెప్పినట్టుగా రోజుకొక ఆంగ్ల పదం  ఆ పదానికి తెలుగు సూచించమని ఇస్తున్నారు. ఒకరిద్దరు తెలుగు పదాలు సూచిస్తున్నారు కాని,  చర్చ జరగటం లేదు.

అక్కడ నిన్న ఆదివారం నేను వ్రాసిన కొన్ని మాటలు ఇక్కడ అందిస్తున్నాను. చర్చ జరిగితే సంతోషం. 

TRAIN:
ఆంగ్లంలో ఒక వరుసలో సొలుపుగా వచ్చే వాటిని ట్రైన్ గా పరిగణిస్తారు. ఒకే విషయం మీద వచ్చే ఆలోచనలను కూడా ట్రైన్ ఆఫ్ థాట్స్ అని అంటారు. ఆవిరితో పనిచేస్తున్న ఒక ఇంజను(ఇదీ ఆంగ్లమే, తెలుగులోకి ఈ విధంగా చేర్చుకోబడింది), బోగీలను (బోగీ కూడా ఆంగ్ల పదమే) లాగుతూ తీసుకు వెళూతూ ఉంటే, అవి వరుసగా వెళతాయి కాబట్టి, ఆ మొత్తానికి "ట్రైన్" అని వ్యవహరించటం మొదలుపెట్టారు. అంతే కాని,  ఒక శుభదినాన బారసాల చేసి ఆ పేరు పెట్టలేదు. ఆవిరి యంత్రం లేనప్పుడూ ట్రైన్ అనే పదం ఆంగ్ల భాషలో  వాడుకలోనే ఉన్నది.  ఈ కొత్త రవాణా ప్రక్రియకు, ఇంగ్లీషు వాళ్ళు కాబట్టి సులువుగానూ చిక్కిరిబిక్కిరి అలోచనలు లేకుండా,  ఉన్నపదాన్నే వాడేశారు. 

ఇక రైలు అని దేనిని అంటారు? మనం రైలు పట్టాలు (పేపరు కాయితం లాగ) అని వ్యవహరించే రెండు సమాంతర ఉక్కు బిల్లెట్స్ ను "రైల్స్" అంటారు. వాటి మీద నడుస్తుంది కాబట్టి "రైల్వే" అనే పదం వాళ్ళ దగ్గర వాడుకలోకి వచ్చింది. మనం అందులో ఉన్న మొదటి పదం మాత్రమే స్వీకరించి హాయిగా "రైలు" అని తెలుగు చేసేసుకున్న ఈ పదం ఎవరూ తీరి కూచుని తయారు చెయ్యలేదు. సామాన్య ప్రజలు తమ వాడుకలో తీసుకు వచ్చిన పదం. ఇంగ్లీషు వాళ్ళు ఎప్పుడూ కూడా రైల్ అనే పదాన్ని, రవాణా సౌకర్యాన్ని సూచించటానికి వాడరు. రైల్వే టైం టేబులు లేదా ట్రైన్ టైం టేబుల్ అంటారు కాని, రైల్ టైం టేబుల్ అని ఎక్కడా వాడరు.

ధూమశకటం అని ఎప్పుడు అంటాము? పొగ వస్తున్న ఒక బండి ఉన్నప్పుడు. అదే లాజిక్ తో పొగ వస్తున్న ప్రతి వాహనాన్ని ధూమశకటంగా  వ్యవహరించాలా! అప్పుడు,  రకరకాల వాహనాల మధ్య తేడా ఎలా కనిపెట్టటం? ఇప్పుడు రైళ్ళు విద్యుత్ తో పనిచేస్తుండి, పొగ రావటం లేదు, వాటిని ఏమని పిలవాలి! ఆంగ్లంలో వాళ్ళు దాన్ని ట్రైన్ (ఒక వరుసలో వెళ్ళేది) అనేశారు కాబట్టి పొగ వచ్చినా రాకపోయిన అదే పేరు నిలిచింది. మనకు తెలుగులోకి ఎప్పుడో "రైలు" అనే పదం వచ్చేసింది. అదే ట్రైన్, అదే రైలు, ఆ పదాల వాడుక ఉద్దేశ్యం ఒక్కటే, ఒకే రవాణా సౌకర్యాన్ని సూచించటం. కాబట్టి మరో కొత్త పదం "వండటం" అనవసరం అని నా ఉద్దేశ్యం.

BREAKFAST:
ఇరవయ్యో శతాబ్దంలో, అది కూడా 1950 ల తరువాత మాత్రమే, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఎక్కువవుతుండగా పట్టణాల్లో వచ్చిన ఒక అలవాటు, పొద్దున్నే తిని బయటకు వెళ్ళటం, అప్పుడైనా చాలామంది పూర్తి భోజనం తొమ్మిదింటికల్ల చేసి, కొద్దిగా బాక్సులో పెట్టుకుని మధ్యాన్నానికి "లంచ్" గా తెచ్చుకుంటారు. కాబట్టి ఈ పొద్దుటి భోజనానికి తెలుగులో పేరు లేదు. సామాన్యంగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పొద్దునే చద్ది అన్నం తిని పనుల్లో పడతారు. అంటే రాత్రి మిగిలిన అన్నం పొద్దున్నే తినటం. బ్రేక్ ఫాస్ట్ కు తెలుగు చెయ్యాలంటే చాలా ఆలోచించినా కూడ తట్టటం అంత సులువు కాదు. మనం పొద్దున్నే తినే తిండికే కాదు, ఎప్పుడు తినే తిండికైనా సరే భోజనం చెయ్యటంగానో లేదా అన్నం/బువ్వ తినటంగానో పరిగణించి అలానే చెబుతూ ఉంటాము. భోజనం కాకుండా మరేదన్నా తింటే, దాన్ని టిఫిన్ అంటాం దానినే అల్పాహారం అనే పదం పుట్టించారు కాని వాడుకలో టిఫిన్ అనే అంటాము. మనకు టైమునుబట్టి తినే పదార్ధానికి పేరు పెట్టుకోవాల్సిన అవసరం కలుగలేదు కాబట్టి, ప్రత్యెక పదాలు తయారవ్వలేదు అని నా అభిప్రాయం. ఇంగ్లీషు వాడు, రాత్రినుంచి ఏమీ తినకుండా పొద్దున్నే తినే ప్రక్రియకు "బ్రేక్", "ఫాస్ట్" అనే రెండు పదాల సముదాయాన్ని ఏర్పరుచుకున్నాడు. ఏ పదకొండింటికో తినటాన్ని బ్రంచ్ (బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కలిపేసి) అని ఒక పదాన్ని 20 వ శతాబ్దంలో వాడుకలోకి అమెరికన్లు తీసుకువచ్చారు.  భాషలో కొత్త పదాలు అమెరికన్లు చాలా సులభంగా తీసుకు వచ్చారు, ఆంగ్ల భాష జన్మ స్థానమైన ఇంగ్లాండ్  తొందరగా ఆ కొత్త మాటలను అంగీకరించ లేదనే చెప్పాలి.

బ్రేక్ఫాస్ట్ అనే ఆంగ్ల పద సముదాయానికి సమాంతరమైన తెలుగు పదం ఇప్పటికిప్పుడు తయారవ్వాలంటె కష్టమైన పనే. ఇక ఆంగ్ల పదాలకు అనువాదకులు ఎలానూ ఉన్నారు, వాళ్ళే ఏదో ఒక పదం చేసి హమ్మయ్య మరొక పదం తయారు చేసేశాం అనేసి సంతృప్తి పడతారు. అంతకంటే మరేమన్నా జరిగే అవకాశం తక్కువ. లేదంటే, జన బాహుళ్యం లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో (పట్టణాలకు 50-60 కిలోమీటర్లకు తక్కువ కాని దూరంలో ఉన్నవి)ఎప్పుడు తిన్నా ఒక్కటే మాటా, తినే సమయాన్ని బట్టి ఒక్కొక్క మాట ఉండాలి అని ఏమన్నా కొత్త మాట జనంలోంచి  రావాలి, పి సి  ముందు కూచుని చటుక్కున తోచిన మాట వ్రాసేవాళ్ళ దగ్గరనుంచి కాదు అని నా దృఢమైన అభిప్రాయం.

CYCLE:
సైకిల్ ఏ అర్ధంలో?  మనం తొక్కే సైకిలా లేక ఆర్ధిక శాస్త్రంలో చెప్పే సైకిలా లేదా సంఘటనల పరంపరా!

తొక్కే సైకిల్ ఐతే తెలుగులో సుఖంగా సైకిలు అనుకోవటం కంటే వేరే ఏ పదం పెట్టినా సరిపోదు, కారణం ఆ వాహనం మన తెలుగు వాళ్ళు కనిపెట్టలేదు.

ఇక మిగిలినవి, జాగ్రత్తగా ఆలోచించి ఆ మాట వాడితే ఇతరులకి కూడా అర్ధం అయ్యే మాట,  కాలక్రమేణా వచ్చే అవకాశం ఉన్నది. ఒక్కో  ఒక్కో విధమైన సొంపుతో వ్యాక్య నిర్మాణం ఉంటుంది. ఆంగ్లంలో సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ అన్న మాట వచ్చినంత సులువుగా తెలుగులో అదే విధంగా వ్రాయలేము. కారణం అటువంటి వ్యాక్య నిర్మాణం మనం చెయ్యము కనుక. ఈ విషయాన్ని కూడా కొత్త పదాల సూచన (సూచనే చెయ్యగలం  కాని,ఇదే కొత్త పదం ఇక ఇవ్వాళి టి నుంచి ఇదే వాడండి అని నియమ పెట్టలేదు ఎవ్వరూనూ!) చేసేప్పుడు గట్టిగా గుర్తుంచుకోవాలి అని నాకున్న భావన. 

PASSWORD:
ఆంగ్లంలో పుట్టిన పదాలకు తెలుగు పదాలను వెతికే క్రమంలో సామాన్యంగా అదే ఆంగ్ల పదాన్ని తెలుగులోకి తర్జుమా చేశె ప్రయత్నమే ఎక్కువగా కనపడుతున్నది. ఆంగ్లంలో ఆ పందం ఎలా ఏర్పడింది? వాళ్ళకు ఆ పదం ఎందుకు ఎంచుకున్నారు? సామాన్యంగా వాడే పదాలనే కూర్చి,  కొత్త పదం చేసుకుంటున్నారు కాని,   వేరే భాషనుండి అనువదించటంలేదు కదా! లేదా వాళ్ళ పురాతన భాషలైన గ్రీక్, లాటిన్ నుంచి కంకర్రాళ్ళను పట్టి తీసుకువచ్చే ఆచారం నుంచి బయట పడ్డారు. కాబట్టి పాస్ అంటె ఏదన్నా పాకేజీ లేదా సైట్ లోకి వెళ్లనివ్వటం అనుకుని, వర్డ్ అంటే పదం అంటూ "ప్రవేశ పదం" వంటి పదాల వంటకం అంత రుచిగా ఉండదు. అందుకని ఆంగ్లంలో ఉన్న పాస్ వర్డ్ సరిపొయ్యేట్టుగా మనం "మంత్రం" అని ఎందుకు అనుకోకూడదు. మంత్రం వెయ్యగానే కావలిసినది జరుగుతుంది. మంత్రం సరికాకపోతే అది పనిచెయ్యదు.

నా దృష్టిలో "మంత్రం" సరైన పదం అని. 
 SIGN IN

ఒకే ఒక్క మాట
"పద"
 
SIGN OUT

"నడు" 

SWITCH:
స్విచ్ మీట అయితే, బటన్ కు తెలుగు ఏమిటి. ఆంగ్లంలో ఒకే మాటకు సందర్భాన్ని బట్టి అనేక అర్ధాలు వచ్చేట్టుగా వాడతారు.

స్విచ్ అనేది నౌన్ ఆపైన వెర్బ్ కూడా. వెర్బ్ నుంచి యదాతధంగా  నౌన్ అయ్యింది, చేసి పనిని బట్టి.   స్విచ్ చేసేపని మార్చటం.

బటన్ అనే పదాన్ని ఇటు గుండీగానూ, అటు ఏదన్నా యంత్ర పరికరన్ని వాడేప్పుడు నొక్కే మీట/బీట గానూ వాడతారు. తెలుగులో కూడా అలా పదాలను చెయ్యగలమా? స్విచ్ అనేది మనకు తెలిసి విద్యుత్ పరికరాలను పనిచేయించటం, ఆపటానికి వాడే ఒక యాంత్రిక అమరిక. ఆ పరికరం తెలుగు వాళ్ళు కనిపెట్టలేదు కాబట్టి తెలుగులో పేరు లేదు. దాన్ని యదాతధంగా "స్విచ్" అని తెలుగులోకి చేర్చుకోవటమే మంచి పని అని నా అభిప్రాయం. 

UNDER GRADUATE AND POST GRADUATE:
తెలుగులో గ్రాడ్యుయేట్ అనే ఆంగ్ల పదానికి సమాంతరం ఏమిటి? ఈ పదం విద్యాపరమైనదిగా ఎక్కువ వాడుకలో ఉన్నది. కాని ఆంగ్లంలో గ్రాడుయేషన్ అంటే, ఒక స్థాయి నుండి మరొక స్థాయికి అభివృధ్ధి చెంది వెళ్ళే ప్రక్రియ. చదువులో కూడా ఒక తరగతి నుండి, మరొక తరగతికి,  ఒక మూడు సంవత్సరాలు ఏకబిగిన చదివి ఒక ప్రత్యేక జ్ఞానాన్ని సంపాయించే ప్రక్రియకు గ్రాడ్యుయేషన్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. మన భారతీయ విద్యా విధానంలో ఒక స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళటానికి వాడేపదం ఏమిటి? నాకు తెలియదు.

ఆ పై స్థాయికి (విద్య విషయంలో) వెళ్ళే ప్రక్రియలో ఉన్న విద్యార్ధిని, అండర్ గ్రాడ్యుయేట్ అని వాడటం పరిపాటి. కాబట్టి తెలుగులో ముందుగా గ్రాడ్యుయేట్ అన్న పదం ఎలా ఉందో చూడాలి. నాకు తెలిసి, పట్టభద్రుడు అనే మాట ఉన్నది. ఆ మూడేళ్ళు చదివినాక పట్టా (అనగా డిగ్రీ) వస్తుంది కాబట్టి, ఈ పదం నప్పింది. ఆ పట్టా పొందే ప్రక్రియలో ఉన్న వాణ్ణి ఏమని పిలవాలి అన్నది ప్రశ్న. కొంచెం కష్టతరమైనదే. "పట్టార్ధి" అనే మాట స్పురిస్తుంది కాని. అది అంతగా నప్పుతుందా, అర్ధి అనే మాట తెలుగేనా, తెలుగు కాకపోయినా వాడేసుకుంటె ఎలా ఉంటుంది అని చూడాలి.

మరి గ్రాడ్యుయేట్ తరువాత చదివే చదువుకు, ఆంగ్లంలో సులభంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని వాడతారు. ఇక్కడ "పోస్ట్" అంటే "తరువాత" లేదా "తదుపరి" అని కాని "టపా" కాదు.(బ్లాగుల్లో వ్రాసే వ్యాసాలకు కూడా తెలుగులో "టపా" అని అంటగట్టి వాడుతుంటారు కాని,  అది పొసగదు.We post our Articles but the article is not a Post. బ్లాగులో ప్రచురించే ప్రక్రియ పోస్టింగ్ అవుతుంది కాని వ్రాసినది టపా అవ్వదు, అది వ్యాసమే అవుతుంది. He posted an entry in the ledger అనే వ్యాక్యం తెలుగు చేస్తూ ఆతను ఆవర్జా లో టపా వేశాడు అంటే వచ్చే  అర్ధం మనం అనుకున్న అర్ధమేనా!  తెలుగులో ఈ టపాను ఎక్కువగా "టపా కట్టేశాడు" అంటే మరణించాడు అనే వాడుకలో ఉన్నది. అది తీసుకు వచ్చి ఆంగ్లలో పొస్టేడ్ అని ఉంది  కాబట్టి ఆ పోస్ట్ చేసినది నౌన్ గా "టపా" అని ఎలా ఎవరు మొదలు పెట్టారో కాని చాలా అసమంజసమైన వాడుక అని నా బాధ. ఇంగ్లీషు  వాడు "పోస్ట్" అనే మాటకు అనేక అర్ధాలు పెట్టుకున్నాడు. తరువాత, వెయ్యటం, టపా ఇలా రకరకాలుగా. కాని తెలుగులో మాటల వాడకం ఇంత సులభంగా అలవడలేదు. మనకు ఒక మాటకు ఒక అర్ధమే ఎక్కువ,

"పట్టభద్రానంతరం" అని "పట్టభధ్రానంతరి" అని వాడగలమా? పైగా అనంతరం అనే మాట తెలుగేనా. 



ఇలా రక రకాలుగా ఒక ఆంగ్ల పదానికి తెలుగు లో తీసుకు రావటానికి ఆలోచనలు వస్తుంటాయి తెలుగులోకి ఆంగ్ల పదాలను ముఖ్యంగా సాంకేతిక పదాలను తేవటం చాలా పెద్ద పని. నిజమైన భాషావేత్త లైన జానపదులకు ఈ పదాలు తెలియవు. వాళ్లకు కూడా ఈ పదాలు తెలిసేంతగా, ఈ సాంకేతికత  మరింత బాగా విస్తరిస్తే అప్పుడు జనబాహుళ్యం నుండి కాల క్రమాన కొత్త వాడుక పదాలు వచ్చే అవకాసం  తప్పనిసరిగా ఉన్నది.కాదూ మేముండగా కొత్త మాటల సృష్టి  చెయ్యగలరు అనుకుని, సవ్యమైన చర్చ లేకుండా కొత్త పద సృష్టి చేస్తే,(ఇప్పుడు ఈనాడు పత్రికలో ఈ ప్రక్రియ   తెగ జరుగుతున్నది) తెలుగు అకాడమీ వారు,  ఏమైనా సరే ప్రతి పదానికి తెలుగు వ్రాసి తీరాలి అని తెలుగు చేసిన ఆ మాటలు వ్రాసిన వాళ్ళు కూడా కూడా పలక గలరా అన్నంత భయభ్రాంతులను చేసేట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా సైన్సు పుస్తకాలకు,  వాళ్ళు ఏ విధంగా తమ పద విన్యాసంతో విద్యార్ధులను హడాలగొట్టి ఇంగ్లీష్ మీడియం వైపుకు పారిపోయ్యేట్టుగా చేసారో గుర్తుండి ఉంటే,   ఈ హడావిడి పద సృష్టికి అంతకంటే ఎక్కువగా  జరుగుతుందని ఎవరూ అనుకోరు.

చివరగా సరదాగా ఒక్క మాట. ఈ కింది తెలుగు వ్యాక్యాన్ని ఇంగ్లీషు వచ్చు అనుకునే వాళ్ళు ఆంగ్లంలోకి అదే సొంపుతో అనువదించి చెప్పటానికి ప్రయత్నించండి  చూద్దాం.

నిన్న వచ్చినాయన ఇవ్వాళా వచ్చాడు 

 మన తెలుగు భాషకు ఉన్న  శక్తి చూడండి. ఇవ్వాళ అన్న మాటకు ఒక దీర్ఘం పెడితే మరొక అర్ధం వచ్చేసింది. అదే అర్ధం వచ్చెట్టుగా మరే భాషలోనన్న ఉన్నదా!  ఒక్కొక్క భాషకు ఒక్కో  సులువు,  సోంపు ఉంటాయి మరి.  ఆ భాషలో ఒక  పదం అలా ఉన్నది   అని, వేరొక  భాషలోకి  యధాతధ అనువాదం చెయ్యబోతే, అనువాదమే అవుతుంది కాని ఒక భాషలోని  పదం మరొక భాషలోకి అదే పద్ధతిన రాదు. ఈ విషయంలో పి జి ఓడ్హౌస్ వ్రాసిన ఏ  ప్రహసనాన్ని అయినా సరే తెలుగులోకి యదాతధ అనువాద ప్రయత్నం చేస్తే,  అదెంత అసాధ్యమో స్పురిస్తుంది. ఆంగ్లలో ఉన్న పదాలను తనకే స్వంతమైన గమకంతో వాడి అద్భత హాస్యాన్ని పండించారు ఓడ్హౌస్. అలాగే తెలుగులో మనకున్న అద్భుత  రచయితల కథలు,  నవలలు ఆపైన కవితలు కూడా పర భాషల్లోకి  అనువదించి అదే భాషా  వైచిత్రితో  ఆంగ్లంలోకి కాని మరే ఇతర  భాషలోకి కాని తేవటం కూడా చాలా  కష్టమైనా పని, ఇంతవరకూ ఎవ్వరూ చెయ్యలేక పొయ్యారు. అలా చేసే అవకాశం  ఉంది ఉంటే, మన తెలుగు రచయితలకు ఎన్నో సాహిత్య నోబెల్ బహుమతులు వచ్చి ఉండేవి. 


చెప్పోచ్చేది ఏమంటే, ఊరికే అనువాదం చేసినంత మాత్రాన పరభాషా పదం మన భాషలోకి రాదుగాక రాదు. అనువాద పదం,  ప్రాణం లేని పదంగానే ఉండటం జరుగుతుందే కాని, వేరొక భాషలో సహజంగా పుట్టి ఆక్కడ వెలుగుతున్న రీతిలో  అనువదించబడిన భాషలో అదే రీతిన వెలగదు.  ఇలా అనువాద పదాలు చేసుకుంటూ పోవటం అనవసర శ్రమ తప్ప మరేమీ కాదు.

Point is mere translation of other language words into another language will not in anyway help in creating new word with equal meaning and with the same ease in that language. The effort will be almost wasted.












6 కామెంట్‌లు:

  1. పింగళి వారు సెలవిచ్చినట్లు కొత్త పదాలు సృష్టించకపోతే భాషాభివృద్ధి ఆగిపోతుంది. కొన్ని అనువాదాలు కాలక్రమేణా అలవాటవుతాయి. ఉదాహరణకు జూడాలు (Junior Doctors) -అనే పదానికి అలవాటు పడ్డాము కదా. మీ వ్యాసం ఆలోచింపచేసింది. కొన్ని ఆంగ్లపదాలను అలానే వాడటం బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. రావుగారూ,మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    పింగళి వారిని ఉదహరిస్తూ కొత్త పదాలను "వండటం" కోసమే తయారు చేస్తే పింగళి వారి ఉద్దేశ్యం నెరవేరదు. ఆయన చెప్పినది సందర్భానుసారం సరైన మాట లేకపోతే, ఒక మంచి మాట తయారు చెయ్యమని కాని, అదేపనిగా కూచుని ఆంగ్ల పదాలకు అంతుచిక్కని అనువాదాలు, ఎబ్బెట్టైన పద సృష్తి చెయ్యమని కాదు. కొంతకాలం క్రితం ఒకాయన క్రెడిట్ కార్డుకు ఋణ రేకు అని పదం సృష్టించాడు. అది చూసి నేను సహించలేక కార్డ్ అంటే రేకు అని ఎలా చెప్తారండీ, పోస్ట్ కార్డును మీ లెక్క ప్రకారం, టపా రేకు అని అంటారా అని వ్యాఖ్య వ్రాస్తే ఆయన సమాధానం ఇవ్వకపోగా నా వ్యాఖ్యనే తొలగించాడు. ఇలా ఉంటాయి కొత్త పదాలను ఏమైనా సరే సృష్టించాలనుకునే "డ్రాయింగ్ రూం తెలుగు పండితుల" తీరు. ఇదే పధ్ధతిన ఎవరన్నా యు ట్యూబ్ కు యధాతధ తెలుగు అనువాదం చేసి, ఇదే వాడదాం అని తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే ఎంతటి చెత్త వాడుకలు తెలుగులోకి వస్తాయో ఈ తెలుగు అనువాద భాషా కోవిదులు ఆలోచించుకోవాలి.

    జూనియర్ డాక్టర్ల గురించిన మీరు చెప్పిన ఉదాయరణ చూస్తే అందులో ఉన్న రెండు పదాలూ ఆంగ్లమే! జూనియర్లో "జూ" డాక్టర్ లో "డా" తీసుకుని "జూడా" అనే పదం సృష్టించబడింది. ఇది తెలుగులో వాడబడుతున్న ఆంగ్ల పదాలకు అబ్రీవియేషనే కాని, తెలుగు పదం కాదు. కాని అది తెలుగు పదమే అనుకునేట్టుగా అందరికీ అర్ధం అయ్యి వాడుకలోకి వచ్చింది. కొంతకాలం పోయినాక, ఈ పద మూలాలు ఎక్కడ అని తరచి చూస్తే కనపడేది ఆంగ్ల పదాలే. ఇదే మాటను జూనియర్ కు ఒక తెలుగు పదం, డాక్టర్ కు మరొక తెలుగు పదం "అనువాదం" చెయ్యటానికి ప్రయత్నించండి, ఎలాంటి మాటలు వస్తాయో!!

    రిప్లయితొలగించండి
  3. ప్రసాద్ గారూ, ఈ వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉన్నది. సంపూర్ణ పరిష్కారం కోసం ఇంకేదో ఉండే ఉంటుంది. అది భాషావేత్తలు , పండితులు అనుకుంటున్నవారు ఆకాశమార్గాన్ని వదిలి భూమి మీదకి వస్తే తప్పక సాధ్యం అవుతుంది. అందుకు మీ వ్యాసం ఖచ్చితంగా ఊ సూచికగా ఉన్నది. మీరిచ్చిన ఉదాహరణలలొ ఓ పదం ఎలా ఏర్పడింది? దాని వెనుక ఆయా భాషలలో ఉన్న నిర్దిష్టత ఏమిటి? అనేది చూసి, అదే విశిష్టత కోల్పోకుండా పదాలు తేలికగా తయారుచేస్తే తప్పకుండా తెలుగు తేలికవుతుంది. లేకుంటే పరాయి భాషవాడి తేలికతనమే అవసరార్ధం అలవాటవుతుంది. మరి ఆలొచించాలి పండితులు? కావలసింది పాండిత్య ప్రదర్శనా? విశిష్టత కోల్పోని తేలిక తనమా? వారు భూమి మీదకు రావాలనుకుంటే తెలుగుకు వెలుగులు వస్తాయి. సామాన్యులు తయారుచేసే వాటిలోనూ తేలికైన తెలుగు పదాలుంటాయి. వాటినీ తీసుకునే విజ్ఞత పండితులకు ఉండాలి. అలా గాక మీకర్ధమయినా కాకున్నా మేము చెప్పాము మీరు వాడితీరాలి అంటే వారు తెలుగు ద్రోహులుగా మిగలడం ఖాయం. ఎప్పటికయినా ఎన్నో సౌలభ్యాలున్న మన వ్యాకరణ నియమాల ఆధారంగా ( మీరన్న 'ఇవ్వాళా'లా) తేలికైన తెలుగు పదాలు సృష్టించబడి తీరతాయి. వాడకంలోకి రావడమూ జరుగుతుంది. ఆర్టికల్ బాగుంది. ఇలాంటి ఆర్టికల్స్ చాలా వస్తే తప్ప తెలుగు బాగుపడదు.

    హరికాలం బ్లాగులో మీరిచ్చిన లింకుల ద్వారా ఈ ఆర్టికల్స్ చదివే అవకాశం కలిగింది. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపూర్ణ పరిష్కారం అనేది ఎప్పటికీ ఉండదు. ఎవరికైనా వారి వారి జీవితకాలంలో జరిగేది మాత్రమే ఏమైనా చూడగలరు, తాము అనుకున్నది చెయ్యగలరు. తమకు ముందు అంతా తప్పనీ, తమ తరువాత వాళ్ళు చిన్నవాళ్ళు అనుభవ శూన్యులనీ, తాము చేసినది గొప్ప పని ప్రతి తరం అనుకోవటం మానవ సహజమైన ఆలోచనా విధానం.ఆ విధంగా ఎప్పటికప్పుదు పరిణితి చెందుతూ నడిచిపోతూ ఉంటుంది. ఏ భాషా కూడా సంపూర్ణంగా వికసించింది, ఇక ఇందులో చెయ్యవలసినది లేదు అనుకునే స్థాయికి వెళ్ళదు. కొత్త వారు వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు పాత వాడుకలను తమ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు. దీన్నే ఆంగ్లంలో ఎవల్యూషన్ అంటారు.

      పండితులు వారి వారి పరిణితి ని బట్టి తమ కవిత్వాలు రచనలు తమ లాంటి వారికోసం మాత్రమె లేదా సామాన్యులకు కూడా అనుకుని రచిస్తారు. రచనలలో రకరకాల ప్రక్రియలు, ఏ ప్రక్రియకు ఉండే సోంపు అందం ఆ ప్రక్రియకు ఉన్నది. ప్రతి రచనా ప్రక్రియా అందరికీ అర్ధం అవ్వాలన్న నిబంధన ఎవ్వరూ పెట్టలేరు. అలా పెడితే చాలా ప్రక్రియలు కనుమరుగవుతాయి. పోషణ ఆదరణ లేక ఇప్పటికే అనేకమైన రచనా ప్రక్రియలు చేసేవారే లేరు. రచనల నుంచీ, కవిత్వం నుంచి సామాన్య పదాల పుట్టుక తక్కువ. భాషలో పదాలు అవసరం కొద్దీ రావాలి తప్ప, ఇవ్వాళ ఒక కొత్త పదం తయారు చేద్దాం అని ఒక "గుంపు' ఒక మాటను చేతిలో పనికదా అని ఇంటర్నెట్టులో పెడితే ఆ మాటేమీ వాడుకలోకి తేవటానికి, సామాన్య ప్రజలు తెలివి తక్కువ వాళ్ళేమీ కాదు. ఏ మాటైనా సరే వాడుకలోకి రాలేదు అంటే అది సవ్యమైన పదం కాదన్న మాటే! పేపర్లల్లో వ్రాసినంత మాత్రాన అది వాడుకలోకి రావాలనీ లేదు, పేపర్లల్లో వ్రాయనంత మాత్రాన అది వాడుక పదం కాకుండా పోదు. పిడి వాదం రాజకీయాల్లో కాని, భాషాభివృధ్ధిలోనూ ప్రమాదకరమైన పధ్ధతి.

      తొలగించండి
    2. నిరంతరం పరివర్తనం చెందడమనేది లోక పోకడ అని భగవద్గీతలో చెప్పినది సర్వకాల సర్వావస్థలలోనూ జరిగే సత్యం. దీనినే పరిణమక్రమం (ఎవల్యుషన్) అంటాం. పిడివాదం ఎక్కడైనా ఎవరు చేసినా చాలా ప్రమాదం. భాషలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతాయి. అయితే పరాయి భాషపై మోజు ( అవసరానికి మించినది) తో భాషను భ్రష్టుపట్టించడం చేయకూడదు. తెలుగుకు పండితులకంటే, సామాన్యులే ఎక్కువ మేలు చేస్తున్నారు.

      తొలగించండి
  4. ఒకే నేను చెఈనది భగవద్గీత కూడా పట్టుకొచ్చి మళ్ళీ చెబుతున్నారు బాగానే ఉన్నది. అవసరానికి మించిన ఎవేరు నిర్ణయిస్తారు. ఎవరి అవసరం వారిది ఒకరి అవసరం మరొకరిమీద రుద్దలేము, రుద్దాలని ప్రయత్నిస్తే వికటిస్తుంది. పండితులకంటే సామాన్యులు మేలు చేస్తున్నారా, సామాన్యులు, పండితులు అని వేర్పాటు వాదం చేయ్యదగ్గది కాదు. పనికొచ్చే పనిచేసేవారు ప్రతివారూ పండితులే. పేచీ అక్కడ అంటే ఒకరికి పనికివచ్చేది మరొకరికి పనికిరానిది అనిపించవచ్చు. ఒకరి అమృతం మరొకరికి విషం అని సామెతే (ఆంగ్లంలో) ఉన్నది, తెలుగులోనూ తత్సమానమైనది ఉండే ఉంటుంది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.