31, అక్టోబర్ 2010, ఆదివారం

అప్పాయింట్‌మెంట్ ఇవ్వరూ

కంప్యూటర్లో తన కలెక్షన్ చూపుతున్న శ్రీ శ్యాం

సామాన్యంగా మనం ఎవరైనా పెద్ద వాళ్ళ దగ్గరకు వెళ్ళాలంటే వారి దగ్గర నుండి ముందస్తు అనుమతి తీసుకునికాని వారిని కలవటం కుదరదు. కారణం, వారి అధికార హోదా వల్ల వారి టైం నియంత్రించుకోవాలి, ఉన్న సమయంలో ఎంతోమందిని కలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి.


అదే విషయం ఎవరైనా ఒక పెద్ద అధికారో ప్రభుత్వంలో ఉన్న మంత్రిగారో మనకు ఫొన్ చేసి, "అప్పాయింట్‌మెంట్ ఇవ్వరూ" అని అడిగితే. ఎంత సంభ్రమంలో ముణిగిపోతాం!! సరిగ్గా ఇదే జరిగింది, ఫిరంగిపురం వాస్తవ్యులు, ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న మన గంధర్వుడు శ్రీ శ్యాం నారాయణ గారికి. ఈయన గురించి ఆంధ్ర జ్యోతిలో కొద్ది కాలం క్రితం వ్యాస ప్రచురణ జరిగినంతనే ఆయన రాత్రికి రాత్రి ఒక 'ప్రసిధ్ధ వ్యక్తి" ఐపోయారు. వార్తా పత్రికలో వచ్చిన వెను వెంటనే మూడు వందలకు పైగా అభిరుచిగల వారు ఆయననకు ఫోన్ చెయ్యటమో, లేక వ్యక్తిగతంగా వచ్చి కలవటమో జరిగింది.
ఇంతకీ ఎవరీ శ్యాం నారాయణ గారు అని అడుగుతున్నారా?? ఒక్కసారి ఈ కింది లింకు నొక్కి చదవండి వివరాలు తెలుస్తాయి.


ఇంతకీ చెప్పోచ్చేది ఏమంటే, శ్యాం గారి అభిరుచి గురించి తెలుసుకున్న ఒక రాష్ట్ర మంత్రిగారు, ఒకానొక రోజున శ్యాం నారాయణ గారికి ఫోను చేసి, "అయ్యా, నాకు అప్పాయింట్మెంటు ఇవ్వరూ, మిమ్మల్ని కలవాలి" అని అభ్యర్ధించారుట. ఇంకెవరన్నా అయితే, మనకే కదా మినిస్టరు గారు ఫోన్ చేశారు అని బిగిసిపోయి, ఏదేదో మాట్లాడేవారు. కాని మన శ్యాం నారాయణ గారు భూమ్మీదే ఉండి, "అయ్యో, అదేమిటి సార్, నేనే సెక్రటేరియట్ కు వచ్చి మిమ్మల్ని కలుస్తాను" అవటా అనేశారుట.

కానీ
ఆ మినిస్టర్ గారు వదలలేదు. మర్నాడు పదకొండు గంటలకు తమ స్నేహితులతో సహా మన శ్యాం నారాయణ గారి షాపుకు దిగిపోయారు. అలా ఆయన్ను చూసిపోదామని వచ్చినాయన, సాయంత్రం మూడు మూడున్నరవరకూ శ్యాం తోనే ఉన్నారుట, ఆయన దగ్గర ఉన్న సంగీతం, పద్యాలు, సినిమా పాటలు, ఆడియో పుస్తకాలు, ఇంకా, ఇంకా అనేకం వింటూ, చూస్తూనూ. అప్పటికీ, ఆ మంత్రి గారిని మధ్యాహ్న భోజనానికి పిలిచినవారు ఫోను మీద ఫోను చెయ్యటం వల్ల ఇక్కడి సంగీత-సాహిత్య గోష్టీ కార్యక్రమాన్ని ఆపలేక ఆపుకుని వెళ్ళారుట.
ఇది జరిగిన కొన్ని రోజులకు, శ్యాం నారాయణ గారి గురించి వ్యాసం వ్రాసిన సరోజా ప్రసాదు గారికి ఫోన్ చేసి, అదే మంత్రిగారు, తాను శ్యాంతో గడిపిన క్షణాలు (కొన్ని గంటలు!!) మధురమైనవి అని మళ్ళి జ్ఞాపకాలను కలబోసుకున్నారుట.

మంత్రి గారికి పద్యాలంటే ఎంతో ఆసక్తి. ఆయన మాటల ప్రకారం, పద్యాలు వ్రాయటం తగ్గిపోయి, మన తెలుగు భాష వెనుకబడిపోతున్నదని వాపోతున్నారు. కారణం అడిగితే, పద్యాలు వ్రాసేప్పుడు, చందస్సు చట్రంలో ఇమడ్చటానికి ఒకే అర్ధం వచ్చే అనేకానేక పదాలు అందరి నోళ్ళల్లో నానుతూ ఉండేవి, ఇప్పుడు పద్యం మోటు అయిపోయి,
నాజూకుగా ఏవో నాలుగు మాటలేకాని, భాషలో పద వైవిధ్యం లేకుండా పోయింది అన్నారుట. నిజమే! మనకున్న కొత్తొక వింత పాతొక రోత పధ్ధతిలో, మునుపటివన్నీ ఆవతల పారెయ్యటమే అలవడింది కదా.

కాళిదాసు
మాళవికాగ్ని మిత్రం నాటకంలో చెప్పించినట్టుగా, కొత్తైనంత మాత్రాన అదేదో గొప్పది కానక్కర్లేదు, పాతదైనంత మాత్రాన ఏ విషయమైనా గొప్పది కాకుండానూ పోదు.


ఇంతకీ ఆ మంత్రి గారు ఎవరో చెప్పనె లేదుకదూ. ఈ కింది బొమ్మ చూడండి మీకే తెలుస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రి శ్రీ డొక్కా మాణిక్య వర ప్రసాద రావు శ్రీ శ్యాం నారాయణతో ఆయన గిడ్డంగిలో(Godown) కూచుని, పాటలు వింటున్న దృశ్యం

శ్రీ మాణిక్య వరపరసాదరావు గారి సాహిత్య అభిరుచికి, తన ఉన్నత స్థితిని పక్కనపెట్టి సామాన్యులను వారి వద్దకే వెళ్లి కలుసుకునే మంచి పద్ధతికి హృదయపూర్వక అభినందనలు
-----------------------------------------------------------------------------------------

ఇక శ్యాం నారాయణ గారి గురించి. నేను ఈ మధ్య హైదరాబాదు వెళ్ళి ఆయనను కలిసినప్పుడు సేకరించిన విశేషాలు.

శ్యాం నారాయాణగారు, పెద్దగా మనం "చదువు" అనుకునే చదువు చదువుకున్నది లేదు. ఇంటర్‌మీడియేట్ పూర్తిచేసుకున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తండ్రి పని చేస్తున్న వెటర్నరరీ విభాగంలోనే, వారికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే కొన్నాళ్ళు ఆ ఉద్యోగాన్ని చేశారు. సాహిత్య అభిరుచి ఉన్న శ్యాం కు ఆ ఉద్యోగం ఎలా నచ్చుతుంది! పైగా ఆయన ఏమంటారంటే, "అదేదో మారు మూల పల్లెటూరు, ఆ పశు వైద్యశాలకు నేను ఇన్‌చార్జిని, అక్కడివారు మంత్రాల మీద చూపే నమ్మకం వైద్యం మీద చూపరు. నా దగ్గరకు ఎవరూ వచ్చే వాళ్ళు కాదు. ఇదేమిరా బాబూ, పనెమీ లేకుండా ఎలా ఉండటం అని తన తండ్రి పూర్వపు స్నేహితులైన పై అధికారులకు మొర పెట్టుకుంటే, వాళ్ళేమో, నీ కేం పోయిందయ్యా, హాయిగా పని చెయ్యకుండా ప్రభుత్వం జీతమిస్తుంటే, వారానికిన్ని కేసులు అని రిజిస్టర్ల్లల్లో వ్రాసేసి నీ జీతం నువ్వు పుచ్చుకో అన్నారుట. ఇలా పనీ పాటా లేకుండా అబధ్ధాలాడుతూ, నేను డబ్బులు తీసుకోలేను" అని ఆ ఉద్యోగం చెప్పా పెట్టకుండా వదిలేసి వచ్చేశారు శ్యాం.

సరే తన ఊరికి దగ్గరైన గుంటూరుకు వచ్చి తన స్నేహితుడికి ఉన్న ఫొటో ఫ్రేం షాపులో కూచోవటం మొదలుపెట్టి, చివరకు ఆ షాపును తానే పర్యవేక్షిస్తూ, లక్షల్లో ఉన్న అమ్మకాలు, కోట్లల్లోకి తీసుకెళ్ళారు. అదే కాకుండా శ్రీ గొర్తి లక్ష్మీ నారాయణ గారు వ్రాసిన అధ్యాత్మిక గ్రంధాలన్నిటికి కవర్ డిజైన్, ప్రూఫ్ రీడింగ్ అంతా ఈయనే చేశారుట.

ఇంట్లో ఉన్న గ్రామఫోన్ పుణ్యమా అని తనకు పాటలు అన్నా, సంగీతమన్నా ఆసక్తి కలిగిందని, తన తొమ్మిదో ఏట నుండి పాటలు, పాటల పుస్తకాలు, బొమ్మలు, ఫొటోలు ఇంకా ఇలా అనేకానేక సంగీత సాహిత్య సంబంధమైనవి సేకరించటం ఆయనకు హాబీగా మారిందని చెప్పారు. ఆయనదగ్గర ఉన్న కలెక్షన్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఒక పాటలేనా, ఆడియో పుస్తకాలెనా, పాటల పుస్తకాల PDF లేనా, ఫోతోలేనా, పాత పుస్తకాలేనా ఎన్నని చెప్పేది. ఆ పాటల్లో కూడ ఎంతటి వైవిధ్యం, ఎన్నెన్ని భాషలు. ఒక్క వ్యక్తి ఇంతటి సేకరణ చేశారు అంటే నమ్మలేం. పైగా సేకరించి ఊరుకునేది లేదు, అన్ని వివరాలు కూడ ఆ పాటకు సంబంధించిన ఫైలులో పొందుపరచాల్సిందే.

ఎంతటి
ఆసక్తి, ఎంతటి ఓపిక మొత్తం మొత్తం తన కలెక్షన్ లో ఉన్న ఏ ఐటం నైనా సరే ఒక్క సెకండు కాలంలో పట్టేసి మన ముందుంచుతారు. అదొక అద్భుత శక్తి. మనమూ కొంతలో కొంత కలెక్షన్ ఉంచుకున్నా, అంత వేగంగా మన దగ్గర ఉన్న పాటనో, లేదా పద్యాన్నో పట్టుకోలేము, వెతకాలి.


ఇక ఇలా గుంటూరులో రోజులు గడుపుతున్న శ్యాం నారాయణ గారు కొంత కాలానికి హైదరాబాదు చేరుకుని, తనకు తెలిసిన ఫొటో ఫ్రేం విద్యతో, ఒక షాపులో పని చేసుకుంటూ తన జీవనాన్ని గడుపుకుటుండగా, అతని సహోద్యోగి ఐన వేలు అనారోగ్యం పాలయ్యాడు. అతని వెన్నులో నొప్పి కారణంగా కూచోలేని పరిస్థితి. ఆ షాపు యజమాని వేలును పనిలోనుండి తొలగించి ఇక మర్నాటినుండి రానక్కర్లేదని చెప్పటంతో, స్నేహితుని మీద ఉన్న ఆప్యాయతతో, శ్యాం నారాయణ్ తాను కూడ ఆ షాపు నుండి బయటకు వచ్చి స్నేహితుని జాగ్రత్తగా చూసుకుని, అతనితో భాగస్వామ్యంగా సొంతంగా ఒక ఫొటో ఫ్రేం షాపును ఏర్పరుచుకున్నారు. అతని స్నేహితుని పెట్టుబడి ఏమీలేదు, అతను శ్యాంతో కలసి పని చేస్తాడు, కాని అతనికి తన షాపులో నాలుగో వంతు వాటాను ఇచ్చి ఆదుకున్నాడు శ్యాం.
ఇది మన హైదరాబాదు గంధర్వుని పూర్వ గాధ.


-----------------------------------------------
శ్యాం నారాయణ్ ఫోటో గ్యాలరీ

-----------------------------------------------


తన పుస్తకా సేకరణతో శ్రీ శ్యాం

తన భాగస్వామి, స్నేహితుడు ఐన వేలుతో శ్యాం
తన షాపు ప్రాంతాల్లో ఆఫీసుల్లో పని చేస్తూ, తనను చూడ వచ్చిన అభిమానులతో శ్రీ శ్యాం నారాయణ

మరొక పాటల సేకరణకర్త శ్రీ కే ఎన్ మూర్తితో (www.sakhiyaa.com)

శ్యాం గారితో నేను
మధ్యనే ఒక ఆంగ్ల పత్రికలో శ్రీ శ్యాం గురించి











*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.