17, మార్చి 2010, బుధవారం

BETTER LATE, THAN NEVER

మా హామ్-బ్లాగ్ మిత్రులతో
మధ్య విజయవాడ వెళ్లాను. మధ్య అంటే అప్పుడే రెండు నెలలు గడిచిపొయినాయి. అక్కడ హాం రేడియో స్నేహితులను, తోటి బ్లాగర్లను కూడా కలవటం జరిగింది. ముందుగా అనుకుని, అందరం రాఘవయ్యా పార్కులో కలిశాం. పై ఫోటో ఏమిటి ఏదో భూగర్భంలో ఉన్న సొరంగంలో కూచున్నారేమిటి అనుకోకండి. పార్కులో కూచున్న కాసేపటికి గట్టి వర్షం మొదలయ్యింది, వర్షానికి అక్కడే ఉన్న ఒక కట్టడంలో తల దాచుకున్నాం కాని, తలలు పైకేత్తలేనంత ఎత్తే ఉన్నది కట్టడం. అది పార్కులో ఎందుకు కట్టారో మటుకు మాకు అర్ధం కాలేదు.


ఇంతకూ మేము కలుసుకున్నది ఎప్పుడో తెలుసా! సంక్రాంతి రోజునే అంటే, 14 జనవరి 2010 . మరింత ఆలస్యమేమిటనా? అవును ఆలస్యం అయ్యింది. ఫోటోలు తీసినాక మా తమ్ముడి పి సి లో దాచాను. ఈలోగా పి సి క్రాష్ అయ్యింది. ఫోటోలు పోయాయనే అనుకున్నాను. కాని, మా అబ్బాయి పెన్ డ్రైవ్ లో ఉన్నాయట. వాడి దగ్గరనుంచి (పూనా నుండి) నాకు రావటానికి ఇంత కాలం పట్టింది.

ఒకటి రెండు రోజుల ముందుగానే, ఫోనులో అందరినీ కదిపి, పార్కు పేరు సూచించి. అందరికంటే ముందుగానే అక్కడకి మా తమ్ముళ్ళతో తయారయ్యాను. మా మంచి స్నేహితుడు ఎప్పటినుండో హాం రేడియో ఆపరేటర్ గా ఉన్న నరసింహం గారు (VU2 LNM) అనుకున్నసమయానికి వచ్చారు. ఎల్ నరసింహం గారు, మేమందరమూ మూర్తి గారనే పిలుస్తాము. మధ్యనే రిటైర్ అయ్యారు. ఎవరన్న నమ్ముతారా ఆయన పదవీ విరమణ చేసారని (పూర్తీ కాలం పని చేసినాకనే). కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన నేషనల్ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ లో కొన్ని దశాబ్దాలపాటు ఆంద్ర ప్రదేశ్ లో అనేక చోట్ల పని చేసి, హాం రేడియోని అభిరుచి కొనసాగిస్తూ ఉన్నారు.

అల్లాగే కాసేపటికి కుమార్(VU2 RRX) వచ్చారు. ఈయన పూర్తీ పేరు సిహెచ్ శేష సాయి కుమార్.
రైల్వే లో జూనియర్ ఇంజనీరు, టేక్వాండో లో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు. సొంతంగా హాం రేడియో తయారు చేసుకోగల సాంకేతిక పరిజ్ఞానం కలవాడు. ఈయనను కుమార్ అని పిలుస్తాము.

మరికొంతసేపటికి మా అందరిలోకి పెద్దవారు రిటైర్డ్ సూపరింటెండెంటు ఇంజనీరుగా రోడ్లు భవనాల శాఖలో ఇరవై ఏళ్లకు క్రితం రిటైర్ అయ్యిన శ్రీ జంధ్యాల సూర్యనారాయణ గారు(VU2 JJS) వచ్చారు. ఆయన వయస్సు ఇప్పటికి 80 చిల్లర అయినప్పటికీ ఆయనలో ఉన్న ఉత్సాహం చూస్తె మనకు కూడా వయస్సు సగానికి తగ్గిపోతుంది. ఈయన కూడా మా హాం స్నేహితులే. ఈయన హాం పేరు "సూర్య" . ఇప్పటికి రోజుకి గంటైనా హాం రేడియో లో మాట్లాడకుండా ఉండరు. విజయవాడలో అన్ని ప్రముఖ బాంకులకు పానెల్ వాల్యుయర్ గా ఓపికగా సేవలు అందిస్తున్నారు.

వీరితో బాటుగా, మా అందరిలోనూ చిన్నవాడు, అయిన రవి కుమార్ (VU3 MGT)కూడా వచ్చాడు. ఇతను విజయవాడలో లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్నారు. హాం రేడియో హాబీ కార్య కలాపాలలో చాలా చుర్గుగా పాల్గొంటున్నారు. ఇక హాములు అయిపోయ్యారు. బ్లాగర్లు ఎవ్వరూ రాలేదేమి అని నేను కంగారు పడుతుండగా మన శిరా కదంబం బ్లాగు అధిపతి శ్రీ శిష్ట్లా రావుగారు దిగారు. అందరం కలసి రాఘవయ్య పార్కులోకి వెళ్లి అక్కడ ఉన్న లాన్ మీద కూచుని ముందుగా పరిచయాలు ప్రారంభించాము.

పరిచయాలు
అవ్వగానే ఒక విచిత్రం జరిగింది. నా హామ్ స్నేహితుడు శ్రీ నరసింహం గారు, మన శిరాకదంబం రావుగారు చుట్టాలాట. ఒకరినొకరు చూసుకుని కొన్ని దశాబ్దాలు అయ్యిందట . వాళ్ళు ఒకళ్ళని ఒకరు చూసుకుని మీరు.......!??? మీరు???!!!... అనుకుంటున్నారు. ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక ఇద్దరూ తమ బంధుత్వం తెలిపారు. నాకు చాలా సంతోషం కలిగింది. నా వల్లనే కదా రోజున చుట్టాలు ఇద్దరూ కలుసుకోగాలిగారు అని.
అలా సంతోషకరమైన సంఘటనతో మొదలయ్యిన మా సమావేశం కొంతసేపు పిచ్చాపాటీతో గడిచింది. హాం హాబీ గురించి రావు గారికి, బ్లాగింగు గురించి మా హాం స్నేహితులకు వివరించాము. ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడాలని అందరూ అనుకోవటమేమిటి , ఒక్క పెట్టున వర్షం వచ్చి పడింది. అది పార్కు, ఎక్కడకి పోవాలి. ఎక్కడ "తల" దాచుకోవాలి అని ఆత్రంగా అక్కడే నెల మాళిగ లోకి మార్గంలా ఉన్న ఒక కట్టడం లో దూరాము. పైన చెప్పినట్టుగా తలలు మాత్రం దాచుకోగాలిగాం కాని, తలెత్తుకునే(!) అవకాశం లేకపోయింది. మీరే చూడండి, పొడుగ్గా ఉన్నవారి బాధ!
ఇక మా కాలేక్షేపం సోరంగంలోనే కొంతసేపు జరిగింది. ఈలోగా వాన తగ్గినా విషయం గమనించి ఎదురుగా ఉన్న టీ స్టాల్ కి వెళ్లి వేడి వేడి చాయ్ చప్పరించాము.


మేమందరమూ కలసి తీయించుకున్న గ్రూపు ఫోటోలో ఇలా "పడ్డాము"
నేను శిరాకదంబం రావుగారు కలసి అక్కడే దగ్గరలో ఉన్న మన "నవ్వులాట" శ్రీకాంత్ గారి ఆఫీసుకి వెళ్ళాము. తాను పార్కుకి రాలేనని, మమ్మల్నే ఆయన తన కార్యాలయానికి ఆహ్వానించారు. మేము వెళ్ళేసరికి ఆయన ఆరోజు పని పూర్తి చేసుకుని నింపాదిగా ఉన్నారు. మేము ముగ్గురమూ కలసి బ్లాగర్ల సమావేశం సాగించాం . పండుగ అవ్వటం మూలాన ఎక్కువమంది బ్లాగర్లు, ముఖ్యంగా మహిళా బ్లాగర్లు సమావేశానికి రాలేకపోయారు. కొంతసేపు బ్లాగులు వాటిల్లో వస్తున్నా రక రకాల వ్యాసాలు, వివాదాలు, బ్లాగుల్లో ఉన్న కొన్ని అనారోగ్య లక్షణాలు, కొంతమంది వెర్రి పోకడలు, వాటి హేతువులు మాట్లాడుకుని ఒకరి దగ్గర మరొకరం శలవు తీసుకున్నాం.
ఏమైతేనేం ఇన్నాళ్ళకు రెండునెలల క్రితం జరిగిన సమావేశాల వివరాలు బ్లాగులో ప్రచురించాను. పనైనా, అస్సలు చెయ్యకుండా ఉండే కంటే, కొంత ఆలస్యమైనా చెయ్యటమే మేలు కదా.

ఆరోజున తీసిన ఫొటోలన్ని మంచి సంగీతం జత
కలిపి ఒక స్లైడు షో తయారు చేసాను. సరదాగా చూద్దాం అనుకునే వాళ్ళు ఈ కింది లింకు నొక్కి ఆ స్లైడు షో ను తీసుకోవచ్చు.

ఫోటో స్లైడ్ షో






************************

2 కామెంట్‌లు:

  1. శివ గారూ !
    సమగ్రమైన, సచిత్ర నివేదికను అందించినందుకు కృతజ్ఞతలు. బ్లాగు ద్వారా ఏర్పడిన స్వేహం మరింత పటిష్టం కావాలని కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  2. కప్పగంతు వారికి నమస్సులు....
    విజయవాడలో మీ బ్లాగర్ల సమావేశం గురించి ఇప్పుడే చదివాను... నా అక్షర హృదయం బ్లాగు పోస్టు పై స్పందించినందుకు ధన్యవాదాలు.....మీ సమావేశం గురించి తెలియకపోవడం చేత తొలి బ్లాగర్ల సమావేశం అని పేర్కనడం జరిగింది... అన్యధా భావించవద్దు.... తొలిగా బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేసిన రికార్డు మీదేనండోయ్!!!! సందేహం వలదు.....ఏదేమైనా ఈ విధంగా (తెరమీద) మనం కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది... మనసు మీ బ్లాగు లోతుల్లోకి లాక్కువెడుతోంది....మళ్లీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను....ధన్యవాదాలతో కూడిన అభినందనలు.....పిఆర్ తమిరి , విజయవాడ....

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.